పోలీస్ స్టేషనులో లాయర్ మృతి... భగ్గుమన్న అనంత
అనంతపురంలో లాయర్ శేషాద్రి మరణం తీవ్ర దుమారం రేపుతోంది. ఓ సివిల్ కేసు విచారణలో భాగంగా అనంతపురం పోలీస్ స్టేషనుకు హాజరైన లాయర్ శేషాద్రి గుండెపోటుతో మరణించారని పోలీసులు చెబుతున్నారు. అయితే, పోలీసులు అవమానించడంతోనే లాయర్ శేషాద్రి మరణించారని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. దీంతో రోడ్డెక్కిన న్యాయవాదులకు మరియు పోలీసులకు మధ్య వివాదం నెలకొంది. పోలీసులు దురుసుగా ప్రవర్తించి, వేధించారని దీంతో మనస్తాపం చెందిన న్యాయవాది శేషాద్రి మరణించారని తోటి న్యాయవాదులు అనుమానిస్తున్నారు. మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించాలంటూ అనంతపురం జీజీహెచ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. అయితే న్యాయవాదుల ఆరోపణలను ఎస్పీ జగదీష్ కొట్టిపారేశారు శేషాద్రి గుండెపోటుతోనే చనిపోయారని వివరించారు.
అయితే, తోటి న్యాయవాదులు మాట్లాడుతూ.. ఓ సివిల్ కేసు విషయమై మాట్లాడాలని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా స్టేషనుకు రప్పించారు. అయితే స్టేషనులోనే అత్యంత అనుమానకర పరిస్థితుల్లో లాయర్ శేషాద్రి మరణించారు. అనుమానస్పద రీతిలో మృతి చెందిన శేషాద్రి మరణానికి గల కారణాలు తెలుసుకోవాలని ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, ఆయన మృతికి గల కారణాలతో కేసు నమోదు చేయాలని పట్టుబడుతున్నారు.
కేవలం సాధారణ ప్రజలే కాదు.. అత్యంత అనుభవమున్న న్యాయవాదులు చట్టం పరంగా లాయర్ శేషాద్రి మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు ఇతర లాయర్లు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. లాయర్లను కూడా పోలీసులు అడ్డుకునే స్థాయికి వచ్చారని మండిపడుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో పోస్టుమార్టం నిర్వహించి, అతని మృతికి గల కారణాలు తెలుసుకుని, శేషాద్రి మరణానికి కారణమైన పోలీసులు మీద చర్యలు తీసుకోవాలని అనంతపురం లాయర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు.
లాయర్ శేషాద్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండా పోలీసులు మధ్యాహ్నం నుండి అడ్డుడుతున్నారు. అదే విధంగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో కూడా మార్పులుచేర్పులు చేశారని అంటున్నారు. తప్పు చేయని పోలీసులు దగ్గరుండి పోస్టుమార్టం చేయించాల్సింది పోయి, ఆయన మరణనానికి న్యాయం చేయాలని, అతని మరణానికి బాధ్యత వహించాలని అంటున్న తోటి లాయర్లను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని పోలీసులపై మండిపడ్డారు.
అధికార పార్టీ వలన సాధారణ ప్రజలకే కాదు... అతి పవిత్రమైన న్యాయ వృత్తిని నిర్వహించే లాయర్లకే న్యాయం దక్కడం లేదని తోటి లాయర్లు వాపోతున్నారు.