ఏపీలో యువతకు గుడ్ న్యూస్

యువతకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టిడ్కో ఇళ్ల సముదాయాల వద్ద యువత, మహిళలకు ఉపాధి కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పట్టణాల్లో నిర్మించిన టిడ్కో ఇళ్ల వద్దనే పలు షాపులు నిర్మించి యువతకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 599 షాపులు నిర్మించి టిడ్కో ఇళ్ల వద్ద 10 శాతం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. మెప్మా మిషన్ డైరెక్టర్ ప్రతిపాదనల మేరకు 9 పట్టణ స్థానిక సంస్థల్లో 10టిడ్కో నివాసిత ప్రాంతాల్లో ఈ జీవనోపాధి కేంద్రాలను మంజూరు చేసింది.
పలు రకాల ఉపాధి కల్పన కేంద్రాలతో పాటు ఉత్పత్తి కేంద్రాలు, గార్మెంట్స్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. పైలట్ ప్రాజెక్ట్ కింద నెల్లూరు, రాజమండ్రి, చిలకలూరిపేట, మంగళగిరి, శ్రీకాకుళం, పిఠాపురం, నంద్యాల, చిత్తూరు, విశాఖపట్నంలోని టిడ్కో కాలనీల్లో జీవనోపాధి కేంద్రాలను నిర్మించనున్నారు. ఇందుకోసం మూడంతస్తుల భవనాలు నిర్మిస్తారు. మొదట విడతలో 315, రెండో విడతలో 284 షాపులు నిర్మిస్తారు. వాటి నిర్మాణాలను టిడ్కో సంస్థ చేపట్టనుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు చదరపు అడుగు సుమారు రూ.2వేలకు విక్రయిస్తారు. ఈ షాపులను కొనుగోలు చేసేందుకు స్వయం సహాయక సంఘాలకు రుణ సహకారం అందిస్తారు.