Breaking: ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా

ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా పేరును బీజేపీ అధినాయకత్వం ఖరారు చేసింది. ఆమె రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రామ్లీలా మైదానంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు రాష్ట్ర పరిశీలకులు సమావేశమై ఢిల్లీ ముఖ్యమంత్రి పేరును ఖరారు చేశారు. అనంతరం బిజెపి శాసనసభా పక్ష సమావేశం కూడా జరిగింది. అధిష్ఠానం ఖరారు చేసిన వ్యక్తిని శాసనసభా పక్ష నేతగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతను ఎన్నుకున్న తర్వాత రాజ్ నివాస్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనాను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారు. వడపోస్తూ వచ్చిన బీజేపీ హైకమాండ్ చివరకు నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసింది. వారిలో ఒకరిని ఖరారు చేసింది. ఈ పోటీలో చివరి వరకు పోటీ పడింది షాలిమార్ బాగ్ నుంచి ఎన్నికైన రేఖ గుప్తా, న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన ఎమ్మెల్యే పర్వేష్ వర్మ, రాజౌరి గార్డెన్ నుంచి గెలిచిన మంజీందర్ సింగ్ సిర్సా, రోహిణి నుంచి ఎలక్టైనా ఎమ్మెల్యే విజేందర్ గుప్తా కూడా చివరి వరకు పోటీలో నిలిచారు.
26 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై కూర్చుంటున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో 48 స్థానాలు గెలుచుకుంది. ఈసారి ఇద్దరు డిప్యూటీ సీఎంలను కూడా ప్రభుత్వంలో ఉంటారని తెలుస్తోంది. ఇప్పటి వరకు సీఎం కోసం జరిగిన పోటీ ఇప్పుడు డీసీఎం కోసం జరగనుంది.