ఆలయ ప్రధాన అర్చకునిపై 20 మంది దాడి

తెలంగాణలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిని గాయపరిచారు. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు బాలజీ ఆలయం సమీపంలోని రంగరాజన్ నివాసానికి శుక్రవారం నాడు పలువురు వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు రంగరాజన్ నిరాకరించడంతో రామరాజ్యం పేరుతో వచ్చిన వ్యక్తుల మాట నిరాకరించినందుకు తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని, తనపైనా దాడి చేశారని, ఈ దాడికి పాల్పడిన వారితో పాటు పరోక్షంగా వారికి సహకరించిన వ్యక్తులను కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చిలుకూరు ప్రధాన అర్చకులు రంగ రాజన్ ఇంటిపై వీర రాఘవ రెడ్డి తన అనుచరులు 20 మందితో కలిసి దాడికి పాల్పడ్డారని రంగరాజన్ కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. తన అనుచరులతో కలిసి ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా రంగరాజన్‌పై వీర రాఘవరెడ్డి అనుచరులు దాడి చేశారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్చకులు మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వీర రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మూడ్రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.