చైనాని టార్గెట్ చేసిన ట్రంప్
మొన్నటి ఈ ఎన్నికల్లో ఆ దేశ 47వ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు డొనాల్డ్ ట్రంప్. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అధ్యక్షుడిగా ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు తాజాగా కీలకమైన నియామకంపై సంతకం పెట్టారు ట్రంప్ . అమెరికా జాతీయ భద్రత సలహదారుగా మైక్ వాల్ట్జ్‌ను నియమించారు. 50 ఏళ్ల మైక్ వాల్ట్జ్.. రిపబ్లికన్ పార్టీ రెప్రజెంటేటివ్. రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందు అమెరికన్ నేషనల్ గార్డ్ ఆర్మీ గ్రీన్ బెరెట్ కల్నల్‌గా పని చేశారు.
మైక్ వాల్ట్జ్ కు చైనా అంటే ఏమాత్రం పడదు. అమెరికన్ రాజకీయాల్లో చైనా విమర్శకుడిగా గుర్తింపు పొందారంటే ఏ స్థాయిలో డ్రాగన్ కంట్రీని వ్యతిరేకిస్తోన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అనుసరిస్తోన్న విదేశాంగ విధానాలను బహిరంగంగా తప్పుపట్టారు. అలాంటి నాయకుడిని జాతీయ భద్రత సలహాదారు పదవికి ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా చట్టాల ప్రకారం ఎన్ఎస్ఏ అపాయింట్‌మెంట్‌కు ఆ దేశ సెనెట్ ఆమోదం అవసరం లేదు. దీనితో మైక్ వాల్ట్జ్ జాతీయ భద్రత సలహదారుగా బాధ్యతలను స్వీకరించడం లాంఛనప్రాయమే.