రూ. 200 కట్టలేక ప్రాణం తీసుకున్న భార్యభర్తలు

కన్నీళ్లు వచ్చినా.. ఏం చేస్తాం మనం..?
ఎన్నో సంబరాలు, వేడుకల మధ్య కొత్త ఏడాదికి స్వాగతం పలికాం. ఒక్క రాత్రికే కోట్లకు కోట్లు ఖర్చు చేశాం. తప్పతాగిన వారున్నారు.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డవారున్నారు. న్యూ ఇయర్ అంటే ఆ మాత్రం జోష్ ఉండాల్సిందే. సరే.. కానీ మనచుట్టూ ఉన్నవారిలో ఒక్క పూట కూడా భోజనం చేయనివారున్నారని మనకెంత మందికి తెలుసు..? కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక కడుపు మాడ్చుకుని బతికేవారు ఉన్నారని మనలో ఎంతమందికి తెలుసు..? జీవితం అంటేనే ఎంటర్ టైన్ మెంట్, ఎంజాయ్ మెంట్ అని.. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని.. ఎక్కువమందితో సంబంధాలు పెట్టుకోవాలని.. కోరికలు తీర్చుకునేందుకు దైవభక్తిని పెంచుకోవాలని.. నేటి లైఫ్ స్టైల్ ఇంతకంటే పెద్దగా భిన్నంగా అయితే కనిపించదు..! ఎక్కడో, ఎవరో, ఒకరిద్దరిలో తప్ప.
డిసెంబర్ 31 మంగళవారం నాడు.. భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ చందన అనే మహిళ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. డిసెంబర్ 6 న ఆమె గడ్డి మందు సేవించడంతో.. ఆస్పత్రిలో ఇన్నాళ్లు చికిత్స తీసుకున్నా.. చివరకు కన్నుమూసింది. అయితే ఆమె తిరిగి కోలుకోలేదని ముందే గ్రహించిన ఆమె భర్త బానోత్ దేవేందర్ డిసెంబర్ 20 న ఉరేసుకుని ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే వీరిద్దరి మరణానికి కారణం ఏంటో తెలుసా..? కేవలం వారానికి రూ.200 కిస్తీ కట్టలేకపోవడమే. వ్యవసాయ కూలి పనులు చేసుకునే వీరు.. ఓ ప్రైవేటు ఫైనాన్స్ నుంచి రూ.2.50 లక్షల అప్పు తీసుకున్నారు. ఇందుకోసం వారానికి రూ.200 కట్టాల్సి ఉంటుంది. కొన్నాళ్లు సక్రమంగానే చెల్లించినా.. భర్త, పిల్లల ఆరోగ్యం బాగుండకపోవడం వల్ల.. కొన్నాళ్లుగా కిస్తీలు కట్టలేకపోయారు. అయితే ఫైనాన్స్ యజమాని కొంతకాలంగా ఒత్తిడి చేయడంతో.. భార్యాభర్తలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చివరకు భార్య చందన డిసెంబర్ 6 న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో వెంటనే ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తన భార్యను అలా చూడలేక.. భర్త దేవేందర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
వీరిద్దరి మరణానికి కారణం ఎవరు..? స్థూలంగా చూస్తే ఆర్థికకష్టాలు, ఫైనాన్స్ యజమాని అని అనుకోవచ్చు. కానీ కనీసం రూ.200 కూడా కట్టలేని స్థితిలో వారున్నారంటే దానికి కారణం ఎవరు..? వీరి కష్టాలు విని కన్నీళ్లు పెట్టుకున్నా.. ఏం చేస్తాం..? ఇంకా మెలిపెట్టే విషయం ఏంటంటే.. వీరిద్దరికి రిషి, జశ్వంత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రుల మరణంతో.. వారిప్పుడు అనాధలయ్యారు. అయితే తమబిడ్డలు కుమారులు కాబట్టి వారిని వదిలివెళ్లినట్లున్నారు. అదే ఆడపిల్లలైతే.. వారికి కూడా నూరేళ్లు నిండేవేమో..?