వల్లభనేని వంశీకి బెయిల్.. అయినా జైలులోనే..

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో ఊరట లభించింది. వల్లభనేని వంశీకి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మల్లవల్లి భూముల్లో తమకు రావాల్సిన పరిహారం వల్లభనేని వంశీ తనకు అనుకూలంగా ఉన్న వారికి ఇప్పించారని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
అయితే, వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ వచ్చినా ఆయన జైలులోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని కేసుల్లో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీ బెయిల్ పిటిషన్ పై విజయవాడలోని జిల్లా కోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. ఆత్కూరులో 8 ఎకరాలు కబ్జా చేశారని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలన్న వంశీ పిటిషన్ పై విచారణ పూర్తి కాగా రేపు తీర్పు ఇవ్వనుంది. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ1గా ఉన్న వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు రంగా రెండో రోజు కస్టడీ పూర్తి అయ్యింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రంగాను విచారించారు సీఐడీ అధికారులు. దాడి వెనుక ఉన్న వారి పాత్రపై సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకి తనకు గుర్తు లేదని తెలియదనే రంగా సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. ఇక, రేపటితో రంగా కస్టడీ ముగిసిపోనుంది.