శారీరక సంబంధం లేకుండా భార్య మరొకర్ని ప్రేమిస్తే అక్రమ సంబంధం కాదు

భర్త కాకుండా వేరే వ్యక్తితో భార్యకు శారీరక సంబంధం లేకుండా ప్రేమ, అనురాగం ఉంటే దానిని అక్రమ సంబంధంగా పరిగణించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అక్రమ సంబంధానికి లైంగిక సంపర్కం తప్పనిసరి అని జస్టిస్ అహ్లువాలియా వెల్లడించారు. కుటుంబ కోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ని విచారిస్తున్న సమయంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
తన భార్య వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నందున ఆమెకు భరణం పొందే హక్కు లేదని భర్త వాదించాడు. అయితే, భావోద్వేగ ప్రమేయం అక్రమ సంబంధం కిందకు రాదని కోర్టు అతడి పిటిషన్‌ని కొట్టివేసింది. ''అక్రమ సంబంధం అంటే లైంగిక కలయిక తప్పనిసరి.. భార్యకు శారీరక సంబంధాలు లేకుండా వేరే వ్యక్తి పట్ల ప్రేమ, ఆప్యాయత ఉన్నప్పటికీ, భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు కాదు'' అని జనవరి 17 నాటి ఉత్తర్వుల్లో హైకోర్టు చెప్పిందని బార్ అండ్ బెంచ్ వెల్లడించింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) లోని సెక్షన్ 144(5), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) లోని సెక్షన్ 125(4) లను ప్రస్తావిస్తూ భార్యకు అక్రమ సంబంధం ఉందని రుజువైతే ఆమెకు భరణం నిరాకరించబడుతుందని స్పష్టంగా ఉందని, అయితే శారీరక సంబంధానికి సంబంధించిన ఆధారాలు లేకుండా ఆమెకు సంబంధం ఉందనే ఆరోపణలను నిలబడవని కోర్టు స్పష్టం చేసింది.