రేవంత్ రెడ్డి కరెక్ట్.. అల్లు అర్జున్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్

Monday, December 30, 2024 01:56 PM News
రేవంత్ రెడ్డి కరెక్ట్.. అల్లు అర్జున్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్

పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన మరియు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ సోమవారం మీడియాతో ఏర్పాటు చేసిన చిట్ చాట్ లో మాట్లాడుకూ, అల్లు అర్జున్ వ్యవహారం గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తెచ్చారన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక డైనమిక్ లీడర్ అని పొగిడారు. వైసీపీ ప్రభుత్వం మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదన్నారు. ప్రీమియర్ షోలు మరియు అధిక ధరలు ఉన్నప్పుడు కలెక్షన్లు రికార్డు స్థాయిలో వస్తాయి.. అందుకే సలార్ మరియు పుష్ప సినిమాలకు భారీ కలెక్షన్లు వచ్చాయని చెప్పుకొచ్చారు.

భారీ అంచనాల నేపథ్యంలో విడుదలైన సినిమాలకు అభిమానుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో హీరోలు థియేటర్లకు వెళ్లడం వలన ఇబ్బందులు వస్తాయి. మొదట్లో నేను కూడా మూడు సినిమాలకు వెళ్లి పరిస్థితి అర్థం చేసుకుని ఆగిపోయాను. అల్లు అర్జున్ కూడా ఆగిపోయి ఉండాల్సింది. అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్ గా వెళ్లి ఉంటే బాగుండేదని పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఇక, సంధ్య థియేటర్ వద్ద మహిళ మృతి చెందడం చాలా బాధాకరం, ఈ ఘటన జరిగిన వెంటనే హీరో లేదా నిర్మాతలు, దర్శకుడు వారి ఇంటికి వెళ్లి వారికి అండగా నిలబడి మీ బాధలో మేము ఉన్నామని భరోసా ఇవ్వాల్సింది అని పేర్కొన్నారు.

అల్లు అర్జున్ విషయంలో సినిమా యూనిట్ ఒక్కటిగా నిలబడి బాధిత కుటుంబానికి అందరూ అండగా నిలబడాల్సింది పోయి మొత్తం అల్లు అర్జున్ మీదనే వదిలేశారు. సినిమా అనేది ఒక టీమ్. ఇందులో హీరోని ఒంటిరి చేశారని పవన్ చెప్పుకొచ్చారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా రంగాన్ని బాగానే ప్రోత్సహిస్తున్నారు. బెనిఫిట్ షో మరియు అధిక ధరలకు అనుమతులు కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదనే కారణం చేత అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం అలా వ్యవహరించిందని నేను అనుకోవడం లేదు అన్నారు. రేవంత్ రెడ్డి అలాంటి వారు కాదు... ఆయన నాకు చాలా కాలంగా తెలుసు కేసు నమోదు అయ్యాక అన్నీ చట్ట ప్రకారం జరిగిపోయాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని తప్పుబట్టలేము. ఆయన స్థానంలో ఎవరున్నా అలాగే ప్రవర్తించాలి లేదంటే పెద్ద సమస్య అవుతుందని పవన్ అన్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: