విజయవాడ కోర్టులో పోసానికి ఎదురుదెబ్బ.. మరో కేసు

వైసిపి మద్దతుదారు, సినీ నటుడు పోసాని కృష్ణమురళీ కేసుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. పోసానికి విజయవాడ సీఎంఎం కోర్టు ఈనెల 20 వరకూ రిమాండ్ విధించింది. జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదు ఆధారంగా విజయవాడ భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సహా కూటమి నేతలు, మీడియా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదు అయ్యింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ ఖైదీగా కర్నూల్ జైలులో ఉన్న పోసానిని ప్రత్యేక వాహనంలో విజయవాడ కోర్టుకు తరలించారు.
విచారణ చేపట్టిన కోర్టు పోసానికి రిమాండ్ విధించింది. దీంతో ఆయనను మళ్లీ కర్నూలు జైలుకు తరలించనున్నారు. విచారణ సందర్భంగా తనపై అక్రమంగా కేసులు పెట్టారని న్యాయమూర్తికి పోసాని తెలిపారు. ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని, గుండె జబ్బు, పక్షవాతం వంటి రుగ్మతలు ఉన్నాయని బెయిల్ ఇవ్వాలని కోరారు.