సుగాలి ప్రీతి కేసు: పవన్ కళ్యాణ్ పై ప్రీతి తల్లి సంచలన వ్యాఖ్యలు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి బాయి కేసు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. న్యాయం కోసం బాధితురాలి తల్లిదండ్రులు పోరాడుతూనే ఉన్నారు. అప్పట్లో టిడిపి ప్రభుత్వం, గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఈ కేసు విషయంలో చేతులెత్తేశాయి. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ కేసు రీఓపెన్ చేస్తామని. నిందితులకు శిక్షపడేలా చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. కేసులో కనీస స్థాయిలో పురోగతి లేదు. దీంతో పవన్ కళ్యాణ్ సైతం తమకు హామీ ఇచ్చి మోసం చేశారని బాధితురాలి తల్లి పార్వతి దేవి చెబుతున్నారు. తమకు న్యాయం చేసిన వారికి రుణపడి ఉంటామని చెబుతున్నారు.
కర్నూలు నగరంలోని శివారు ప్రాంతంలో రాజు నాయక్, పార్వతి దేవి అనే దంపతులు నివసించేవారు. వారి కుమార్తె సుగాలి ప్రీతి బాయ్ కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదివేందుకు చేరింది. 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయినట్టు పాఠశాల యాజమాన్యం చెబుతోంది. పాఠశాల యజమాని కుమారులే చేయకూడని పనిచేసే చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆమెపై దారుణం జరిగిందని వెల్లడించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి పెతాలజీ హెచ్ఓడి సైతం ఇదే విషయాన్ని పేర్కొన్నారు. దీనిపై ఒక నివేదిక కూడా ఇచ్చారు.
అయితే అప్పట్లో స్పష్టమైన ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాల యజమానితో పాటు అతడి కుమారులను నిందితులుగా పేర్కొంటూ కేసు పెట్టారు. దీంతో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ ఘటనపై కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. విచారణకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రీతి ఒంటిపై ఉన్న గాయాలు, అక్కడి దృశ్యాల పై ఆ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమానం కూడా ఉందని పేర్కొంది. ఆమెను అంతమొందించారని చేయకూడని పని చేశారని కూడా నివేదిక ఇచ్చింది ఆ కమిటీ. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అయితే కేవలం 23 రోజుల్లో మాత్రమే వారు జైల్లో ఉన్నారు. తరువాత బెయిల్ పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేస్తారని వారు భావించారు. అందుకు తగ్గట్టుగానే పవన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ కేసులో సీన్ మారింది. సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రస్తావించారు. అధికారంలోకి వస్తే చురుగ్గా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేస్తామని కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్. కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. కానీ కేసులో ఎటువంటి చలనం లేదు. పైగా దర్యాప్తు నుంచి తప్పుకుంటున్నట్లు సిబిఐ కోర్టుకు నివేదించింది. ఇతర కేసుల్లో బిజీగా ఉండడం వల్ల తాము ఈ విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు కోర్టుకు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు ప్రస్తావించి రాజకీయంగా లబ్ధి పొందారు అన్న అపవాదు ఉంది. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసు గురించి వాకబు చేసిన దాఖలాలు కూడా లేవు. బాధిత కుటుంబంలో కూడా అదే అసంతృప్తి ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాధితురాలి తల్లి మాట్లాడారు. అందరూ రాజకీయ నాయకులు మాదిరిగానే పవన్ కూడా మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ కూడా మించి పోలేదని తమకు న్యాయం చేస్తే దివ్యాంగురాలు అయిన తాను అతి కష్టం మీద వెళ్లి పవన్ కళ్యాణ్ రుణం తీర్చుకుంటానని బాధతో చెబుతున్నారు.