ఏపీ ప్రభుత్వంపై రేవంత్ తీవ్ర ఆరోపణలు

Monday, March 3, 2025 08:56 PM News
ఏపీ ప్రభుత్వంపై రేవంత్ తీవ్ర ఆరోపణలు

ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కృష్ణా బేసిన్‌ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధిక నీటిని తీసుకుంటోందని, దీంతో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అన్నారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీ.ఆర్. పాటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు తెలంగాణ ఎంపీలతోపాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నీటి తరలింపును అడ్డుకోవాలని తాము కేంద్రాన్ని కోరామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చేపడుతోన్న బనకచర్లపై తమ అభ్యంతరాన్ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు తెలియజేశామన్నారు.

ఏపీ నుంచి ఈ బనకచర్ల ప్రాజెక్ట్‌పై తమకు ఎలాంటి డీపీఆర్ రాలేదని మంత్రి వివరించారని తెలిపారు. అలాగే పాలమూరు, రంగారెడ్డి, సమ్మక్క - సారక్క ప్రాజెక్టులకు.. త్వరగా నీటి కేటాయింపులు చేయాలని మంత్రిని కోరినట్లు ఆయన వివరించారు. ఇక తమ ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) క్లియరెన్స్ ఇంకా రాలేదని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరామని చెప్పారు. గోదావరి జలాలను అనుసంధానం చేసే అంశాన్ని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. సమ్మక్క సారక్క, సీతారామ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంత వరకు జరగలేదని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో తమ ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం చెబుతోందంటూ ఏపీపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తమ ప్రాజెక్టులకు, శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతే నికర జలాలు ఉన్నాయనేది లెక్క తేలుతుందని ఆయన వివరించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: