దావోస్ వేదికగా రికార్డు.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డును నెలకొల్పింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై తెలంగాణ గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు భారీ పెట్టుబడులను సమీకరించింది. 3 కంపెనీల ద్వారా రాష్ట్రానికి రూ.56,300 కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో రాష్ట్ర యువతకు దాదాపు 10,800 ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సంస్థ 'సన్ పెట్రో కెమికల్స్' రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ, జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై (ఎంవోయూ) సంతకం చేసింది.
నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో మూడు చోట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3,400 మెగావాట్లు. వీటికి 5,440 మెగావాట్ల సామర్థ్యముండే సోలార్ విద్యుత్తు ప్లాంట్లను అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7000 ఉద్యోగాలు లభించనున్నాయి.