పోసాని కృష్ణమురళిపై నరసారావు పేటలో మరో కేసు నమోదు

సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali)పై పల్నాడు జిల్లా నరసరావుపేట(Narasaraopeta) టూటౌన్ పీఎస్‌లో మరో కేసు నమోదు అయ్యింది. దీంతో.. సోమవారం ఉదయం ఆయన్ని రాజంపేట సబ్ జైలు నుంచి అక్కడికి తరలిస్తున్నారు. ఈ ఉదయాన్నే పీటీ వారెంట్(PT Warrant)తో నరసరావుపేట టూటౌన్ పోలీసులు రాజంపేట సబ్‌జైలుకు చేరుకున్నారు. పోసాని మీద బీఎన్ఎస్ 152ఏ, 504, 67 ఐటీ యాక్టుల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అభియోగాలు ఏంటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
పోసాని భార్యను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కడప కోర్టు(Kadapa Court) పోసాని కృష్ణ మురళీ తరఫున లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇంకోవైపు పోసానిని కలిసేందుకు వైఎస్సార్సీపీ నేతలు ములాఖత్ పెట్టున్నారు. అయితే ఈ లోపే ఆయన్ని నరసరావుపేట తరలించడం గమనార్హం.
పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 కేసులు నమోదు చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయనకు గతంలో సర్జరీ జరగడంతో పాటు ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్యతో పాటు వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.