మూడో సారి ఓడిపాయే.. ఆప్ నూ ఓడిపించె..
_(24)-1739086720.jpeg)
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా మూడో సారి కూడా అసలు ఖాతా తెరవలేదు. ఆరుశాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ నెగ్గలేకపోయింది. చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. కొన్ని చోట్లయితే నాలుగో స్థానానికి పడిపోయింది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయావకాశాలనూ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఒక రకంగా భాజపా నెగ్గడానికి కాంగ్రెస్ కూడా కారణమైందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ తాను ఓడటమే కాక ఆమ్ ఆద్మీ పార్టీనీ కోలుకోలేని దెబ్బ తీసింది. ఓట్లను చీల్చి చాలా స్థానాల్లో ఫలితాలను తారుమారు చేసింది.
న్యూదిల్లీ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో ఆప్ అధినేత అరవింద్ కేజీవాల్ 4,089 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీచేసి మూడో స్థానంలో నిలిచిన సందీప్ దీక్షిత్ కు 4,568 ఓట్లు వచ్చాయి. ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉంటే కేజీవాల్ స్వల్ప మెజారిటీతో గట్టెక్కేవారే. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా పోటీ చేసిన జంగపురాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ భాజపా అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో సిసోదియా కేవలం 675 ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఫర్హాద్ సూరికి 7,350 ఓట్లు వచ్చాయి. గ్రేటర్ కైలాస్లో మంత్రి సౌరబ్ భరద్వాజ్పై 3,188 ఓట్లతో భాజపా అభ్యర్థి షికారాయ్ విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 6,711 ఓట్లు పడ్డాయి. రాజేందర్ నగర్, ఛతర్పుర్, సంగమ్ విహార్, గ్రేటర్ కైలాస్ ఇలా 14కు పైగా స్థానాల్లో ఆప్ అవకాశాలకు కాంగ్రెస్ గండి కొట్టింది.