ఒక్క మాటతో బీజేపీని గెలిపించిన కేజ్రీవాల్
-1739022828.jpg)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ మాట్లాడిన ఒక మాటే ఆ పార్టీ ఓటమికి కారణమైందనే వాదన బలంగా వినిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనకు సహకరించడంలేదని, తనను పట్టుబట్టి వేధిస్తోందంటూ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రచారం చేశారు.
అభివృద్ధి విషయంలో కేంద్రప్రభుత్వం సహకరించడంలేదని, తాను మోదీని ఎదుర్కొనే దమ్మున్న నాయకుడినంటూ ప్రచారం చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఢిల్లీ ప్రజలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. ఈ ప్రచారమే కేజ్రీవాల్‌ను దెబ్బతీసిందనే చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఒక పార్టీ, ఢిల్లీ శాసనసభలో మరోపార్టీ ఉంటే ఢిల్లీ అభివృద్ధికి ఇబ్బందికరంగా మారుతుందనే ఆలోచనతో ఈసారి ఢిల్లీ ప్రజలు ఓటు వేసినట్లు ఫలితాల సరళి చూస్తే తెలుస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఢిల్లీ అభివృద్ధికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఆలోచనతో ఓటరు ఈసారి బీజేపీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.