రాజకీయాలకు కొడాలి నాని స్వస్తి.. ?
వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం రాజకీయంగా తీవ్ర చర్చకు తెరతీసింది. రాజకీయాలకు గుడ్ బై చెబుతూ ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విజయసాయిరెడ్డి బాటలో మరికొందరు వైసీపీ నేతలు ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో మరికొందరు వైసీపీ కీలక నాయకులు ఆ పార్టీని వీడనున్నారని, రాజకీయాల నుంచి తప్పుకుంటారనే ప్రచారం సాగుతోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి కొడాలి నాని గురించి కూడా ఇలాంటి ప్రచారమే సాగుతోంది. ఈ నెల 25న కొడాలి నాని వైసీపీకి రాజీనామా చేస్తారని చర్చ నడుస్తోంది. ఆరోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఇది వైసీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా కలకలం రేపుతోంది.
ఆ విషయంపై కొడాలి నాని స్వయంగా స్పందించారు. అది అవాస్తవం అని ఆయన క్లారిటీ ఇచ్చారు. తన గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్న ప్రచారంలోనూ వాస్తవం లేదన్నారు. అది ఎడిటెడ్ న్యూస్ అని, ఫేక్ అని, దాన్ని ఎవరూ నమ్మొద్దని స్వయంగా సోషల్ మీడియాలో స్పందించారు.