ఓలా ఎలక్ట్రిక్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు

ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. నష్టనివారణ చర్యల్లో భాగంగా 1,000 మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించనున్నట్లు సమాచారం. ప్రొక్యూర్మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి విభాగాల్లో ఈ కోత ఉండనుంది.
గతేడాది నవంబర్‌లో 500 మందిని తొలగించిన ఓలా ఇప్పుడు మరోసారి ఉద్యోగులపై వేటు వేస్తోంది. 2024 మార్చి నాటికి 4,000 మంది ఉద్యోగులు ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌లో తాజా తొలగింపులతో దాదాపు 25% మంది ఉద్యోగులను కోల్పోనుంది. కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడంతో షేర్లు 5% పడిపోయి 52 వారాల కనిష్టాన్ని తాకాయి.
ఆగస్టు 2023లో ఓలా ఐపీఓ బలంగా ప్రారంభమైనప్పటికీ, ఆ తరువాత స్టాక్ 60% క్షీణించింది. డిసెంబర్ త్రైమాసికంలో నష్టాలు 50% పెరిగాయి. మార్కెట్లో పోటీ పెరగడంతో ఓలా తన నాయకత్వ స్థానాన్ని కోల్పోయింది. 2023 చివరిలో దేశంలోని 10 ప్రధాన ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లలో 9 చోట్ల ఓలా తన స్థానాన్ని కోల్పోయింది.
బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ వంటి సంస్థలు ఓలా ఎలక్ట్రిక్‌ను అధిగమించాయి. మార్కెట్లో తిరిగి స్థిరపడేందుకు, వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు కంపెనీ డిసెంబర్ 2023లో 3,200 కొత్త అవుట్లెట్లను ప్రారంభించింది.